ఎల్బీనగర్
జీయెస్ఐ డివిజన్ పరిధిలోని రాక్‌టౌన్ కాలనీలో తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సంప్రదాయాన్ని సమున్నతంగా చాటారు.
తెలంగాణ బతుకమ్మ పండుగ తొలి రోజు వేడుకల్లో భాగంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. కాలనీ ప్రాంగణంలో గౌరమ్మను కొలువుదీర్చి, బతుకమ్మ పాటలతో సామూహికంగా చప్పట్లు కొడుతూ భక్తిశ్రద్ధలతో నృత్యాలు చేశారు.
ఈ వేడుకలను కాలనీ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి మరియు సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ ద్వారా కాలనీలో ఐక్యత, సఖ్యత వెల్లివిరిశాయని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించేలా ఈ కార్యక్రమం అద్భుతంగా సాగింది.



