Saturday, September 5, 2026
Google search engine
Homeతెలంగాణహకీంపేట ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణాలపై సీ.ఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణ!

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణాలపై సీ.ఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణ!

నాణ్యతా లోపాలకు అంకుశం.. పనుల వేగవంతంపై సర్కార్ కఠిన ఆదేశాలు

హైదరాబాద్:

రాష్ట్రంలో విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం, నిర్మాణ రంగంలో ఎటువంటి అవినీతికి, నాణ్యతా లోపాలకు తావులేకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో జరుగుతున్న భారీ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రతి అంగుళాన్ని జల్లెడపట్టిన ముఖ్యమంత్రి.. అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

*మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా బృహత్తర ప్రాజెక్ట్
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను, అత్యుత్తమ వైద్య సేవలను ఒకే ప్రాంగణంలో అందించాలన్న సంకల్పంతో ఈ హబ్ రూపుదిద్దుకుంటోంది. ఈ పర్యటనలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు, ప్రభుత్వ వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాలల భవనాలను సీఎం పరిశీలించారు. వీటితో పాటు ప్రజలకు అందుబాటులోకి రానున్న 430 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణ తీరును ఆయన పరిశీలించారు. ప్రతి విభాగానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలిస్తూ, ప్రాజెక్టు పురోగతిపై ఆరా తీశారు.

*సమన్వయ లోపంపై ఆగ్రహం.. కఠిన పర్యవేక్షణకు ఆదేశాలు
వివిధ విభాగాల మధ్య సరైన సమన్వయం లేకపోతే పనుల్లో జాప్యం జరుగుతుందని సీఎం హెచ్చరించారు. భవన నిర్మాణాలన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలంటే అన్ని శాఖలు ఒకే తాటిపై నడవాలని స్పష్టం చేశారు. నిర్మాణ రంగంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, నాణ్యతా ప్రమాణాలు మరియు సాంకేతిక అంశాలను ప్రతీ క్షణం పర్యవేక్షించాలని సాంకేతిక నిపుణులను ఆదేశించారు. నాణ్యతలో తేడాలు వస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

*జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి.. వాటర్ హార్వెస్టింగ్ వెల్స్
వర్షాకాలంలో ఎడ్యుకేషన్ హబ్ ప్రాంగణంలో నీరు నిలిచిపోయి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసిపట్టేలా వ్యూహాత్మక ప్రణాళికలు ఉండాలని తేల్చిచెప్పారు. క్యాంపస్ అంతటా సమర్థవంతమైన వాటర్ హార్వెస్టింగ్ వెల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సేకరించిన వర్షపు నీటిని వృథా కానివ్వకుండా, ప్రాంగణంలోని పచ్చదనం మరియు ల్యాండ్‌స్కేపింగ్ పనులకే పూర్తిగా వినియోగించేలా ఇంజనీరింగ్ ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments