కీసర మండలంలో కబ్జాదారుల చెరను వీడిన పార్కు, మార్కెట్ స్థలాలు
సంగారెడ్డి జిల్లాలో సాకి చెరువు ఆక్రమణలకు హైడ్రా చెక్
హైదరాబాద్,
రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రజా అవసరాల భూములను పరిరక్షించడంలో హైడ్రా తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి గ్రామ పరిధిలోని టీపీఎస్ చాముండిపట్నం కాలనీలో అన్యాక్రాంతమైన విశాలమైన ప్రజా భూములను మంగళవారం పూర్తిగా స్వాధీనం చేసుకుంది. లేఅవుట్ నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఆక్రమణలను తొలగించి, రక్షిత భూములుగా బోర్డులను ఏర్పాటు చేసింది.
*దశాబ్దాల పోరాటానికి ఫలం:
గ్రామంలోని 1983 నాటి లేఅవుట్ ప్రకారం పార్కు కోసం ఆరు వేల గజాలు, మార్కెట్ మరియు ప్రజా అవసరాల నిమిత్తం మరో రెండు ప్రాంతాల్లో చెరో ఆరు వేల గజాల చొప్పున మొత్తం 7,200 గజాల స్థలాన్ని కేటాయించారు. అయితే కొందరు అక్రమార్కులు ఈ భూమిపై కన్నేసి ప్రీకాస్ట్ గోడలను నిర్మించారు. చివరికి ఆ ప్రాంతంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు స్థానికులను కూడా అనుమతించకుండా అడ్డుకున్నారు. పార్కు స్థలాలను ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు యత్నించారు.
దీనిపై చాముండిపట్నం కాలనీ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా అధికారులు మున్సిపల్, రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. లేఅవుట్ మ్యాప్‌లను పరిశీలించి ఆక్రమణలు నిజమేనని నిర్ధారించారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా బలగాలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి, స్థలానికి పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేశాయి. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న తమకు హైడ్రా చర్యలతో న్యాయం జరిగిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
*సాకి చెరువుకు రక్షణ కవచం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని చారిత్రక సాకి చెరువును కూడా హైడ్రా ఆక్రమణల బారి నుంచి కాపాడింది. సుమారు వంద ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ చెరువును ఆక్రమించేందుకు కొందరు అసాఘిక శక్తులు నిత్యం లారీలతో మట్టిని తెచ్చి నింపుతున్నారు. ఇరిగేషాన్ శాఖ అధికారులు ఒంటరిగా ఈ కబ్జాలను అడ్డుకోలేక హైడ్రాను ఆశ్రయించారు.
ఇరిగేషాన్ అధికారుల విజ్ఞప్తి మేరకు మంగళవారం రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, చెరువు చుట్టూ సుమారు కిలోమీటరు మేర ముళ్ల తీగ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇకపై చెరువులో ఎవరూ మట్టి పోయడానికి వీలులేకుండా కట్టడి చేశారు. చెరువు కబ్జాకు గురికాకుండా కాపాడిన హైడ్రా అధికారులకు చుట్టుపక్కల కాలనీల నివాసులు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు.


