- ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి దూరంగా ఉండాలి: డీజీపీ పిలుపు
- అప్పుల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు తీసుకోవద్దు
- ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే కుటుంబ సభ్యులతో, అధికారులతో పంచుకోవాలి
హైదరాబాద్:
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి డీజీపీ సి.వి. ఆనంద్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసలై, అప్పులపాలై సిబ్బంది ప్రాణాలు తీసుకోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. గడచిన నాలుగు నెలల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత, మధ్య వయస్కులైన కానిస్టేబుళ్లు ఈ దుర్మార్గపు వలలో చిక్కుకోవడం బాధాకరమన్నారు.
ఈ అనర్థాలపై నిర్వహించిన అంతర్గత విచారణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లే ప్రధాన కారణమని తేలిందని వెల్లడించారు. కొందరు తమ భూములు అమ్ముకోగా, మరికొందరు స్నేహితుల వద్ద, సహోద్యోగుల వద్ద భారీగా అప్పులు చేసినట్లు స్పష్టమైంది. ఇంకొందరు అధిక వడ్డీ వ్యాపారుల చేతిలో మోసపోయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

*వ్యసనాలకు స్వస్తి… కుటుంబమే మన శక్తి:
అప్పులు ఇచ్చిన వారి నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిళ్ల కారణంగా సిబ్బంది మానసిక క్షోభకు గురవుతున్నారని డీజీపీ తెలిపారు. అయితే, తమ ఆర్థిక పరిస్థితిని జీవిత భాగస్వాములకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ వెల్లడించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోందని పేర్కొన్నారు. సమస్య ఎంత పెద్దదైనా సరే, కుటుంబ సభ్యులతో చర్చించాలని, దాచిపెట్టి ఒంటరి పోరాటం చేయవద్దని హితవు పీలిక చేశారు.
పోలీసు శాఖలోని సుమారు 93 వేల మంది సిబ్బందిని ఉద్దేశించి డీజీపీ ఈ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌లతో పాటు మధుపానం, మత్తు పదార్థాల వంటి సామాజిక దుర్లవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏకకాలంలో మానసిక ఒత్తిడి లేదా ఇతర సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడకూడదని, వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి తగిన సాయం పొందాలని కోరారు.
*కుటుంబం కోసం ధైర్యంగా జీవించండి
ఆత్మహత్య అనేది ఏ సమస్యకూ పరిష్కారం కాదని, క్షణికావేశంలో తీసుకునే ఈ నిర్ణయం కుటుంబంపై తీరని వేదనను నింపుతుందని డీజీపీ పేర్కొన్నారు. మీపై పూర్తిగా ఆధారపడిన భార్యాపిల్లలను, కన్న తల్లిదండ్రులను అనాథలుగా మార్చవద్దని భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. మీరు లేకపోతే వారి బాగోగులు ఎవరు చూస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని సూచించారు. కష్టాలను ఎదుర్కొంటూ ధైర్యంగా జీవించాలని, ప్రాణాలను విలువైనవిగా భావించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.



