23.02 కిలోల గంజాయి, రెండు వాహనాలు స్వాధీనం
ఎల్బీనగర్:
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్, నాగోలు పోలీసులు ఛేదించారు. ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 23.02 కిలోల గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, గంజాయి రవాణాకు ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.11.51 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.నాగోలు పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 504/2026లో ఎన్‌డీపీఎస్ చట్టం-1985లోని సెక్షన్ 8(c), 20(b)(ii)(C) కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 11న ఒడిశా నుంచి హైదరాబాద్‌కు రెండు వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్ బృందానికి అందింది. దీంతో నాగోలు పోలీసులతో కలిసి నాగోలు ఎక్స్‌రోడ్ సమీపంలోని భారత్ పెట్రోల్ పంప్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన AP31AJ3312 నంబర్ గల టయోటా ఇన్నోవా, OD05AX5899 నంబర్ గల మహీంద్రా XUV300 వాహనాలను పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేశారు. ఇన్నోవా డిక్కీలో నాలుగు ప్యాకెట్లు, ఎక్స్‌యూవీ 300 డిక్కీలో రెండు ప్యాకెట్లలో దాచిన గంజాయిని గుర్తించారు. మొత్తం 23.02 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయిన వారిని ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన త్రినాథ్ నిరికె (40), సోనా హుంతల్ (28)గా గుర్తించారు. ఇద్దరూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరు స్నేహితులని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గంజాయి రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. కోరాపుట్ జిల్లా లాంప్తాపూర్ తహసీల్ పరిధిలోని మల్లిపాడ గ్రామానికి చెందిన ‘కమ్ము’ అనే వ్యక్తి సూచనల మేరకు గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తీసుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.హైదరాబాద్‌లోని వినియోగదారులకు గంజాయిని విక్రయించేందుకు నిందితులు రెండు వాహనాల్లో రహస్యంగా ప్యాకెట్లను తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ‘కమ్ము’ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి సరఫరా చైన్‌లో ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విక్రేతలు, వినియోగదారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు.
ఈ ఆపరేషన్ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి (ఐపీఎస్) ప్రత్యక్ష పర్యవేక్షణలో, ఎల్‌బీనగర్ జోన్ డీసీపీ బి. అనురాధ (ఐపీఎస్), ఎస్‌ఓటీ డీసీపీ కె. మనోహర్, ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్ అదనపు డీసీపీ ఎండీ షాకీర్ హుస్సేన్, నాగోలు పీఎస్ ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ, ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్ ఇన్‌స్పెక్టర్ కె. ప్రతాప్ రెడ్డితో పాటు ఎస్‌ఓటీ, సరూర్‌నగర్ పోలీసు సిబ్బంది సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.


