- జంతర్ మంతర్ వద్ద ‘టీడబ్ల్యూజేఎఫ్’ ఆధ్వర్యంలో ‘ఛలో పార్లమెంట్’ మహాధర్నా
- వర్కింగ్ జర్నలిస్టుల రక్షణ చట్టం, రైల్వే ప్రయాణ రాయితీల పునరుద్ధరణే ప్రధాన డిమాండ్లు
జర్నలిస్టులకు రైల్వే రాయితీలు రద్దు చేసి, ఇళ్ల స్థలాలు గుంజుకుని, రక్షణ లేక రోడ్డున పడేస్తే గానీ ప్రజాస్వామ్య నాల్గో స్తంభానికి అసలైన ఊపు రాదనుకున్నట్టుంది ప్రభుత్వం! అందుకే ఢిల్లీ పీఠం కదిలేలా జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జర్నలిస్టులు సమరశంఖం పూరించారు. ‘చలో పార్లమెంట్’ ధర్నాతో హక్కుల పోరాటానికి ఊపిరిపోస్తూ, కేంద్రం చెవుల్లో సీసం పోసుకున్నా వినిపించేలా గళమెత్తారు. ఇకనైనా ప్రధాని మోడీ, రైల్వే మంత్రి వైష్ణవ్‌లు మెలకువ వచ్చి స్పందిస్తారో, లేక నినాదాల హోరులోనూ యథావిధిగా కునుకు తీస్తారో చూడాలి!
*న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా సమాచార రంగాన్ని రక్షిస్తూ, ప్రజాస్వామ్య నాల్గో స్తంభంగా నిలుస్తున్న పాత్రికేయుల ప్రాథమిక హక్కుల సాధన కోసం తెలంగాణ జర్నలిస్టులు దేశ రాజధానిలో గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని జర్నలిస్టుల సమగ్ర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఇచ్చిన “ఛలో పార్లమెంట్” పిలుపుతో పార్లమెంట్ సమీపంలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వందలాది మంది పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నాయకుడు, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు.
*మీడియా రక్షణకు శాస్త్రీయ, చట్టబద్ధమైన ప్రాతిపదిక అవసరం
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల సామాజిక భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ధర్నా వక్తలు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి (UN) మార్గదర్శకాల ప్రకారం సత్యశోధనలో పాల్గొనే సమాచార ప్రసారకులకు భద్రత కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. అయితే, ఇటీవల కాలంలో జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు, ఆర్థిక అభద్రత వారి విధుల నిర్వహణకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే కింది ప్రధాన అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు:
*వర్కింగ్ జర్నలిస్టుల రక్షణ చట్టం: వైద్యం, రక్షణ లేని ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తున్న విలేకరులకు ప్రత్యేక రక్షణ చట్టం తక్షణ అవసరం.
*రైల్వే ప్రయాణ రాయితీల పునరుద్ధరణ: కొవిడ్ సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసులను వెంటనే పునరుద్ధరించాలి.
*జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు: మారుతున్న సాంకేతిక యుగంలో డిజిటల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రరంగాలలో పనిచేస్తున్న కార్మికుల హక్కుల రక్షణకు జాతీయ స్థాయి కమిషన్ వ్యవస్థ అమల్లోకి రావాలి.
*విశ్రాంత జర్నలిస్టులకు పెన్షన్: జీవితాంతం సమాజ సేవకు అంకితమైన విశ్రాంత పాత్రికేయులకు జాతీయ స్థాయి పెన్షన్ పథకం అమలు చేయాలి.
*నివాస స్థలాల తీర్పు సమీక్ష: జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేసి, అర్హులైన ప్రతి విలేకరికి నివాస హక్కు కల్పించాలి.
పోరాటం మరింత తీవ్రతరం: టీడబ్ల్యూజేఎఫ్ స్పష్టీకరణ*
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు రాజీలేని పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో పాత్రికేయుల స్వేచ్ఛకు, భద్రతకు విఘాతం కలిగిన ప్రతిసారీ టీడబ్ల్యూజేఎఫ్ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు.
ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో తెలంగాణ పాత్రికేయులు చూపిన చొరవ అభినందనీయమని, ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సంఘాల మద్దతు ఉంటుందని తెలిపారు.
*ప్రధాని, రైల్వే మంత్రికి వినతిపత్రాలు
ధర్నా అనంతరం తమ న్యాయబద్ధమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ల కార్యాలయాలకు అందజేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఉపాధ్యక్షుడు లియాఖత్, ప్రతినిధి మాన్విక మిశ్రా, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు కుంచం శ్రీనివాస్, కుడుతాడి బాపురావు, కే. రమాదేవి, జగదీశ్వర్, పద్మనాభ రావులతో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


