Friday, August 7, 2026
Google search engine
Homeతెలంగాణచెరువుల్లోకి నిర్మల జలాలు.. హైడ్రా సరికొత్త ప్రయోగం!

చెరువుల్లోకి నిర్మల జలాలు.. హైడ్రా సరికొత్త ప్రయోగం!

  • గోవా బిట్స్ పిలానీలో వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ సాంకేతికతపై అధ్యయనం
  • తొలి విడతగా పాతబస్తీలోని బమృకున్-ఉద్-దౌలా చెరువుపై ప్రత్యేక దృష్టి
  • హైదరాబాద్:
    మహానగరంలో అన్యాక్రాంతమై, కాలుష్య కోరల్లో చిక్కుకున్న జలవనరుల పునరుద్ధరణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) మరో ప్రతిష్టాత్మక చర్యకు శ్రీకారం చుట్టింది. చెరువుల్లోకి చేరే మురుగు నీటిని అడ్డుకుంటూ, కేవలం శుద్ధి చేసిన వర్షపు నీరు మాత్రమే చేరేలా శాస్త్రీయ పద్ధతుల్లో కసరత్తు చేస్తోంది. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఫలితాలిచ్చే అధునాతన జల శుద్ధి విధానాలపై లోతైన అధ్యయనం ప్రారంభించింది.
    ఈ క్రమంలోనే గోవాలోని ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీ (కేకే బిర్లా గోవా క్యాంపస్) అభివృద్ధి చేసిన ‘వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్’ సాంకేతికతను పరిశీలించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం గోవాలో పర్యటించారు. పట్టణ సరస్సుల పునరుద్ధరణ, స్థిరమైన మురుగునీటి నిర్వహణపై ఆ సంస్థ ఆహ్వానం మేరకు ఈ పర్యటన కొనసాగింది.

*ప్రకృతి ఒడిలో జల శుద్ధి..
గోవా క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనలో భాగంగా సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్‌బీఆర్), మెంబ్రేన్ బయో రియాక్టర్ (ఎంబీఆర్) మరియు వెట్‌ల్యాండ్ ట్రీట్‌మెంట్ విధానాలను హైడ్రా బృందం పరిశీలించింది. కేవలం ప్రదర్శనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఈ సాంకేతికత ద్వారా మురుగు నీటిని ఏ విధంగా ప్రకృతిసిద్ధంగా శుద్ధి చేస్తున్నారో ప్రత్యక్షంగా తిలకించారు.
ఈ విధానంలో అతి తక్కువ విద్యుత్ వినియోగం, తక్కువ నిర్వహణ వ్యయం ఉండటంతో పాటు దీర్ఘకాలిక సమర్థత మెండుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సహజ సిద్ధమైన నీటి శుద్ధి పద్ధతి ద్వారా నీటి నాణ్యత మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం పరిపుష్టి చెందుతాయని అక్కడి నిపుణులు, ప్రొఫెసర్లు వివరించారు. ఈ పర్యటనలో చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాఫ్ట్స్ అధిపతి యూనస్ కూడా వెంట ఉన్నారు.

*బమృకున్-ఉద్-దౌలా చెరువు నుంచి తొలి అడుగు..
గోవా పర్యటన అనంతరం హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలి దశలో పాతబస్తీలోని చారిత్రక ‘బమృకున్-ఉద్-దౌలా’ చెరువులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే నగరంలోని ఇతర చెరువుల పునరుద్ధరణలోనూ ఈ ప్రకృతి ఆధారిత జల శుద్ధి విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా హైడ్రా అడుగులు వేస్తోందని ఈ చర్య ద్వారా మరోసారి స్పష్టమైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments