Friday, September 18, 2026
Google search engine
Homeతెలంగాణబి.ఆర్.ఎస్ భూకబ్జాలు, బినామీ రిజిస్ట్రేషన్లపై రగిలిన అసెంబ్లీ..

బి.ఆర్.ఎస్ భూకబ్జాలు, బినామీ రిజిస్ట్రేషన్లపై రగిలిన అసెంబ్లీ..

  • మంత్రి పొంగులేటి సంచలన నిజాలు!
  • అసైన్డ్‌, భూదాన్‌ భూముల దోపిడీపై నిప్పులు చెరిగిన రెవెన్యూ మంత్రి
  • హరీశ్‌రావు, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక

భూదోపిడీలు, బినామీ దందాలతో రాష్ట్రాన్ని దోచుకున్న గులాబీ నేతల ముసుగులు ఒక్కటొకటిగా తొలగిపోతున్నాయి! అసైన్డ్‌, భూదాన్‌ భూములను అడ్డగోలుగా కబ్జా చేస్తూ, చెలరేగిపోయిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఇప్పుడు నీతులు వల్లిస్తుండటం సిగ్గుచేటు. నకిలీ ఎన్‌ఓసీలు, స్టేటస్‌కో ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన ఆ బృందం, అవినీతి బండారం బట్టబయలవుతుంటే ఉలిక్కిపడి సభా హక్కులంటూ డ్రామాలాడుతోంది. అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామంటున్న మంత్రి పొంగులేటి హెచ్చరికలతో ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి!

హైదరాబాద్:

శాసనసభ వేదికగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత పాలనలో జరిగిన భూ కుంభకోణాలు, నిషేధిత 22(ఏ) జాబితా ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉరుములు ఉరిమినట్లుగా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతల బాగోతాలను ఒక్కటొకటిగా బట్టబయలు చేస్తూ మంత్రి సంధించిన ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల అంశంలో మాజీ మంత్రి హరీశ్‌రావును సూటిగా నిలదీసిన పొంగులేటి, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని తారాస్థాయికి చేర్చారు.

*హరీశ్‌రావుపై పల్లా సూటి ప్రశ్నలు..

నైతికతపై నిలదీత
అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది చట్టవిరుద్ధమేనని, నేరమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్ద్వంద్వంగా తేల్చిచెప్పారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వమే తన మామ భూములకు ఎన్‌ఓసీ ఇచ్చిందని హరీశ్‌రావు చేస్తున్న వాదనలను ఆయన తీవ్రంగా తిప్పికొట్టారు. చట్ట వ్యతిరేకమైన పనులకు ఏ ప్రభుత్వం వత్తాసు పలికినా తప్పేనని స్పష్టం చేస్తూ, ‘‘మరి మీ మామ భూముల విషయంలో ఆనాడు రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకున్నారు? అప్పుడు మీ బుద్ధి ఏమైంది?’’ అంటూ హరీశ్‌రావును ఘాటుగా ప్రశ్నించారు. చట్టాలను తమ కుటుంబ ప్రయోజనాల కోసం వక్రీకరించుకున్న బీఆర్‌ఎస్‌ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన ధ్వజమెత్తారు.

*పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ల అక్రమాల బాగోతం:
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూదాన్‌ భూమిని నకిలీ ఎన్‌ఓసీ సృష్టించి మరీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పొంగులేటి సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే స్వయంగా కబ్జాలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మరో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ సైతం నిషేధిత జాబితాలోని భూమిని కోర్టుల తీర్మానాలను, స్టేటస్‌కో ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని నిలదీశారు. ప్రభుత్వ భూమిని ఏ ప్రభుత్వ హయాంలో ఎవరు కాజేసినా సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

*నిషేధిత 22(ఏ) జాబితాలో భారీ అక్రమాలు:
రాష్ట్రంలో దుమారం రేపుతున్న 22(ఏ) నిషేధిత భూముల జాబితాకు సంబంధించి మంత్రి పొంగులేటి పలు కీలక వివరాలను బయటపెట్టారు. ఈ జాబితాలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూముల్లో కేవలం నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే అసలైన పట్టా భూములని, మిగిలిన భూమంతా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పనంగా కట్టబెట్టిన ఆ భూముల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 47,440 ఎకరాలను తగ్గించినట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని జరిగిన భూ బాగోతాలపై త్వరలోనే సమగ్ర వివరాలను ప్రజాక్షేత్రం ముందుంచుతామని ప్రకటించారు.

*అక్రమాలు బయటపడుతుంటే ఉలిక్కిపడుతున్న బీ.ఆర్‌.ఎస్‌ నేతలు!
తమ అవినీతి బండారం బయటపడుతుందనే భయంతోనే బీఆర్‌ఎస్‌ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సభలో నిజాలు నిలదీసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం కేవలం కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ధనాన్ని, భూములను కాపాడటంలో ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments