- దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వీరుల కుటుంబాల సంక్షేమం మనందరి బాధ్యత
- అమర వీరుల కుటుంబాల సన్మాన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరు
- స్వర్గీయ పండిట్ కృష్ణదేవ్ త్రిపాఠి విగ్రహావిష్కరణ చేసిన గవర్నర్
- ఉత్తరప్రదేశ్ లో పలు కార్యక్రమాలలో పాల్గొన్న గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని, వారి కుటుంబాల త్యాగం, సహనం, అంకితభావం జాతికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా అన్నారు.
దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వీర జవాన్ల కుటుంబాల గౌరవం, సంక్షేమం, వారి పిల్లల భవిష్యత్తుకు అండగా నిలవడం ప్రభుత్వం, సమాజం ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు.
మంగళవారం ఉత్తరప్రదేశ్లోని డియోరియా లోని నేషనల్ పబ్లిక్ స్కూల్లో సమర్పణ సంస్థ నిర్వహించిన అమర వీరుల కుటుంబాల సన్మాన కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ….
సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతుంటే.. వారి వెనుక కుటుంబాలు ఎన్నో త్యాగాలు ఉన్నాయని భావోద్వేగంగా పేర్కొన్నారు.
అమర వీరుల కుటుంబాలను గౌరవించడం కేవలం ఒక కార్యక్రమానికి పరిమితం కాకూడదని, వారి సుఖదుఃఖాల్లో భాగస్వాములై, వారి అవసరాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశభక్తి నినాదాల్లోనే కాకుండా విధుల పట్ల నిబద్ధత, సామాజిక సామరస్యం, ప్రజాసేవలోనూ ప్రతిఫలించాలని సూచించారు. అమర వీరుల కలల భారతాన్ని నిర్మించేందుకు యువత బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అమర వీరులకు ఘన నివాళులర్పించి, వారి కుటుంబాలకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు.
కృషక్ ఇంటర్మీడియట్ కళాశాల వ్యవస్థాపకులు
స్వర్గీయ పండిట్ కృష్ణదేవ్ త్రిపాఠి విగ్రహావిష్కరణ
ఉత్తరప్రదేశ్లోని విషుణ్పూర్లో కృషక్ ఇంటర్మీడియట్ కళాశాల వ్యవస్థాపకుడు స్వర్గీయ పండిట్ కృష్ణదేవ్ త్రిపాఠి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. గ్రామీణ విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.
రుద్ర మహాయజ్ఞంలో గవర్నర్
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా బర్హల్గంజ్ ముక్తిపథ్లో చిల్లూపర్ ఎమ్మెల్యే శ్రీ రాజేశ్ త్రిపాఠి నిర్వహించిన రుద్ర మహాయజ్ఞంలో గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు.
యజ్ఞాలు త్యాగం, సేవ, సమర్పణ, లోకకల్యాణానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని మానవ సేవ, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణతో అనుసంధానించాలని పిలుపునిచ్చారు. భగవాన్ రుద్రుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు.



