- జోనల్ కమిషనర్ వికాస్ మహతో ఐఏఎస్ తో మధుయాష్కీ , మల్రెడ్డి రామిరెడ్డి బేటి
- *చెరువుల సుందరీకరణ, రహదారుల విస్తరణ, బోనాలు ఏర్పాట్లపై ప్రత్యేక చర్చ
- *నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి వినతి
**హైదరాబాద్:
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోల్, బండ్లగూడ చెరువులతో పాటు సాహెబ్ నగర్‌లోని కాప్రాయి చెరువును తక్షణమే సుందరీకరించి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ఐ.ఎ.ఎస్ ను కలసి నియోజకవర్గంలోని పలు పౌర సమస్యలపై విస్తృతంగా చర్చించారు, ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి,రాగుల వెంకటేశ్వర్ రెడ్డి,వజీర్ ప్రకాష్ గౌడ్,ముద్దగోని లక్ష్మీప్రసన్న, సుజాత నాయక్, యాదగిరిగుట్ట దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
*జోనల్ కమిషనర్‌కు సమర్పించిన ప్రధానాంశాలు
1.బోనాల ఉత్సవాల ఏర్పాట్లు: రానున్న ఆషాఢ బోనాల పండుగను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయాల వద్ద అవసరమైన ప్రాంతాల్లో మట్టి పూడ్చి, మౌలిక వసతులు కల్పించాలి.
2.పాదచారుల బాట (ఫుట్‌పాత్) సరిచేత: ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ సమీపంలో విపరీతమైన రద్దీకి కారణమవుతున్న రహదారి ఫుట్‌పాత్‌ను పునర్నిర్మించి, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలి.
3.చెరువుల పునరుద్ధరణ: నాగోల్, బండ్లగూడ, కాప్రాయి చెరువులలో గుర్రపుడెక్క తొలగించి సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి.
4.సిమెంట్ రోడ్ల నిర్మాణం: నియోజకవర్గంలోని పలు కాలనీలలో దెబ్బతిన్న రోడ్ల స్థానంలో నూతన సిమెంట్ (సీసీ) రోడ్లను నిర్మించాలి.
5.బాధితులకు పరిహారం:హయత్ నగర్ పాత ఊరు రహదారి విస్తరణలో భాగంగా ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్న బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలి.
*సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్
మధుయాష్కీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం విజ్ఞప్తులపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. రోడ్ల విస్తరణ, పరిహారం చెల్లింపు అంశంపై ప్రతి శనివారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. హయత్ నగర్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
*ఓటర్ల నమోదు ప్రక్రియపై సమీక్ష
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ముమ్మర ఓటర్ల నమోదు ప్రక్రియ (ఎస్ఐఆర్)పై జోనల్ కమిషనర్‌తో మధుయాష్కీ చర్చించారు.
*సమయ వేళల మార్పు: పగటిపూట ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం బయటకు వెళ్తుండటంతో ఓటరు నమోదు పత్రాలు పూర్తిస్థాయిలో సేకరణ కావడం లేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్లను సందర్శించాలని సూచించారు.
*పార్టీ సహకారం:కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ స్థాయి ఏజెంట్లను (బీఎల్‌ఏ) క్షేత్రస్థాయికి పంపి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఓటర్ల నమోదు శాతాన్ని పెంచేందుకు తమ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.


