- 22/ఏ, యూఎల్‌సీ ఉచ్చుపై ఈటల రాజేందర్‌కు వినతి.
- మల్కాజ్‌గిరి ఎంపీని కలిసిన కాలనీ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి.
హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండల పరిధిలోని రాక్ టౌన్ కాలనీ ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం కాలనీ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్‌ను నేరుగా కలిసి కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందిని వివరించారు. ప్రభుత్వ నిషేధిత జాబితా మరియు పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్‌సీ) నిబంధనల కారణంగా నివాసితులు రిజిస్ట్రేషన్లు, అనుమతులు పొందలేక అవస్థలు పడుతున్న వైనాన్ని ఆయన ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు.
వివాదంలో సర్వే నంబర్లు.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు:
ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చర్యల్లో భాగంగా కొన్ని కాలనీలు, వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా (22/ఏ) కింద చేర్చింది. ఇందులో భాగంగానే రాక్ టౌన్ కాలనీలోని సర్వే నంబర్లు 12 మరియు 16 పరిధిలోని మొత్తం 39,067 గజాల భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చినట్లు అధికారిక అంతర్జాల వేదికలో నమోదు కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఈ కాలనీకి 22/ఏ నిబంధన వర్తించదని, తక్షణమే ఈ జాబితా నుంచి ఈ భూములను తొలగించాలని కోరుతూ రాక్ టౌన్ కాలనీ సంఘం తరఫున ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, సరూర్‌నగర్ మండల రెవెన్యూ అధికారికి (ఎంఆర్ఓ) రెండుసార్లు వినతి పత్రాలు సమర్పించినట్లు అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి తెలిపారు.
*న్యాయస్థానం స్పష్టత ఉన్నా వీడని అష్టకష్టాలు:
కాలనీకి సంబంధించిన యూఎల్‌సీ అంశంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) స్పష్టమైన తీర్పునిచ్చింది. కాలనీకి ఎలాంటి యూఎల్‌సీ బకాయిలు లేదా భూములు లేవని న్యాయస్థానం స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వ అంతర్జాల వేదిక నుంచి ఆ వివరాలను తొలగించకపోవడం గమసార్హం. దీనివల్ల స్థానికులు తమ ఆస్తుల క్రయవిక్రమాలకు రిజిస్ట్రేషన్ల కోసం, భవన నిర్మాణ అనుమతుల కోసం వెళ్లినప్పుడు రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*చట్టబద్ధమైన పరిష్కారానికి ఎంపీ హామీ
రాక్ టౌన్ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ రెండు ప్రధాన సమస్యలను (22/ఏ మరియు యూఎల్‌సీ) శాశ్వతంగా పరిష్కరించే దిశగా తగిన చొరవ తీసుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్‌ను ఎర్ర వినోద్ రెడ్డి కోరారు. ప్రభుత్వ పరంగా ఉన్న అడ్డంకులను తొలగించి, కాలనీ వాసులకు న్యాయం జరిగేలా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు కాలనీ సంఘం వర్గాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన పలువురు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.



